తెలంగాణసంగారెడ్డి

CDR: సంగారెడ్డిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.. 254 మంది లబ్ధిదారులకు రూ.2.54 కోట్లు అందజేత!

పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది.

సంగారెడ్డి: పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ వేదికపై మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

సంక్షేమం, అభివృద్ధిపై మంత్రి ప్రసంగం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయమే కాకుండా సామాజిక, విద్యా, వైద్య రంగాల్లో భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో కాట్రాక్ట్ శస్త్రచికిత్సలు సహా అన్ని ఆధునిక సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ‘ప్రణాము’ కార్యక్రమం ద్వారా వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ప్రజా ప్రభుత్వం: నిర్మల జగ్గారెడ్డి
నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు అడగకుండానే అవసరాలను గుర్తించి తీరుస్తున్నామని పేర్కొన్నారు. ఇంటి స్థలం లేని వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాలకు చెందిన 254 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.2.54 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్డీవో రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *