తెలంగాణసంగారెడ్డి

Githam:వ్యర్థాల నిర్వహణలో గీతం వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు: ప్రతిష్ఠాత్మక ఐటీసీ ‘వావ్’ అవార్డు కైవసం

పర్యావరణ హితమైన విధానాలను అమలు చేస్తూ, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంలో హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన ప్రత్యేకతను చాటుకుంది.

హైదరాబాద్: పర్యావరణ హితమైన విధానాలను అమలు చేస్తూ, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంలో హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన ప్రత్యేకతను చాటుకుంది. కాగితపు వ్యర్థాల పునర్వినియోగం (రీసైక్లింగ్), ప్రాంగణంలో స్థిరమైన పర్యావరణ పద్ధతులను పాటించినందుకు గాను, ఐటీసీ (ITC) సంస్థ గీతంకు ప్రతిష్ఠాత్మకమైన ‘వావ్’ (WOW – Wellbeing Out of Waste) అవార్డును ప్రదానం చేసింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థి ప్రతినిధులు, గీతం ఆతిథ్య బృందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ లక్ష్యాలకు అనుగుణంగా వనరుల విభజన, రీసైక్లింగ్ ప్రక్రియలో రాణించిన సంస్థలకు ఐటీసీ ఈ అవార్డులను అందజేస్తోంది. ఇందులో భాగంగా గీతం హైదరాబాద్ విభాగం ఏకంగా 20,975 కిలోల కాగితపు వ్యర్థాలను ఐటీసీ జాతీయ రీసైక్లింగ్ కార్యక్రమానికి అందించింది. ఈ చొరవ వల్ల 2025-26 సంవత్సరానికి గాను నీరు, విద్యుత్ శక్తి ఆదా అవడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించినట్లు ఐటీసీ తన ప్రశంసా పత్రంలో వెల్లడించింది.

ఈ సందర్భంగా క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ మాట్లాడుతూ.. ఈ విజయం గీతంలోని ప్రతి విద్యార్థి, సిబ్బంది  సామూహిక కృషికి దక్కిన గుర్తింపు అని అన్నారు. పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా కాకుండా, ఒక జీవన సంస్కృతిగా మార్చడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. విద్యాబోధనతో పాటు సామాజిక బాధ్యతను పాటిస్తూ పర్యావరణం పట్ల నిబద్ధతను చాటుకుంటున్న గీతం వర్సిటీని పలువురు అభినందిస్తున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *