
సిద్దిపేట: పట్టణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటుతూ ప్రముఖ జ్యోతిష్యుడు, కవి డాక్టర్ కలకుంట్ల రాజేశ్వర్ రెడ్డి అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య రంగంలో ఆయన అందిస్తున్న నిరంతర సేవలను గుర్తిస్తూ ప్రముఖ సాంస్కృతిక సంస్థలు ఆయనను సత్కరించాయి.
విజయవాడలో ఘనంగా పురస్కార ప్రదానం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జాతీయ ప్రతిభా పురస్కారాలను అందజేస్తుంటారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డిని “అక్షర ప్రవీణ” జాతీయ ప్రతిభా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
సాహితీ సేవకు గుర్తింపు
డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గత కొంతకాలంగా జ్యోతిష్య శాస్త్రంతో పాటు సాహిత్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాహితీ రంగంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వారికి ఇచ్చే ఈ పురస్కారం ఇప్పుడు ఆయనను వరించడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. రాజేశ్వర్ రెడ్డికి జాతీయ స్థాయి పురస్కారం లభించడం పట్ల సిద్దిపేటలోని పలువురు ప్రముఖులు, కవి మిత్రులు, పండితులు హర్షం వ్యక్తం చేశారు.



