తెలంగాణసంగారెడ్డి

Sangareddy: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోను: జగ్గారెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలించడంపై జగ్గారెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు దూరంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలించే ఆలోచనపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో అధికారులు సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీసును పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని కర్ధనూరుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయం సంగారెడ్డి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. జిల్లా కేంద్రం నుంచి ఈ ఆఫీసును మార్చడం అన్యాయం’ అని ఆయన పేర్కొన్నారు.

అధికారులకు హెచ్చరిక
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు. “మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈ విషయంపై చర్చించేవరకు ఎలాంటి తరలింపు ఆలోచనలు చేయవద్దు. ఇది నా సూచన మాత్రమే కాదు, హెచ్చరిక కూడా” అని ఆయన అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రస్తుతం సంగారెడ్డిలో ఉన్న పటాన్ చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కావాలంటే పటాన్ చెరు ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని, అంతేకానీ సంగారెడ్డికి చెందిన కార్యాలయాలను దూరం చేయవద్దని ఆయన కోరారు.

సంగారెడ్డిలోని ఆస్తులను ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుండాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నెలవుగా ఉండాలని, అలాంటిది ముఖ్యమైన రిజిస్ట్రేషన్ ఆఫీసును తరలిస్తే నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వికేంద్రీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఆయన సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *