GITAM: గీతం యూనివర్సిటీలో వైభవంగా త్యాగరాజ ఆరాధన
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధన – 2026 వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.

రుద్రారం: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధన – 2026 వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. లలిత, ప్రదర్శన కళల విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తమ సంగీత ప్రదర్శనలతో వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామికి ఘన నివాళులర్పించారు.
ఆకట్టుకున్న కీర్తనల ఆలాపన: కార్యక్రమం ఆనందు మురళి, మృదు రవళిల ‘ఎందరో మహానుభావులు..’ కీర్తనతో భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమైంది. అనంతరం మృదు రవళి ‘నమో నమో రాఘవ’, ‘బాల కనక మయా..’ వంటి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. చారుకేశి రాగంలోని ఆలాపన, తాళం, పల్లవిల మేళవింపు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వయోలిన్‌పై మహావాది వాసు, మృదంగంపై ఎం.చంద్రకాంత్ అందించిన సహకారం ప్రదర్శనకు మరింత శోభను చేకూర్చింది.

విద్యార్థుల ప్రతిభ: కర్ణాటక సంగీతాన్ని మైనర్ ప్రోగ్రామ్‌గా ఎంచుకున్న విద్యార్థులు ‘రామా కోదండ రామా..’, ‘గంధము పూయరుగా..’ వంటి కీర్తనలను అద్భుతంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. భారతీయ కళా వారసత్వాన్ని కాపాడటంలో గీతం సంస్థ చూపిస్తున్న నిబద్ధతను ఈ వేడుక ప్రతిబింబించింది. ఈ కార్యక్రమాన్ని విభాగం సమన్వయకర్త డాక్టర్ వై.లలితా సింధూరి పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆనందు మురళి, దర్భా మృదురవళి పర్యవేక్షించారు.



