కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన నిర్మలా జగ్గారెడ్డి
జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది

హైదరాబాద్: జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. సోమవారం గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అజారుద్దీన్ సమక్షంలో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ ఫారాలను అందజేశారు.
మంగళవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, అభ్యర్థులందరికీ ముందే బి-ఫారాలను సిద్ధం చేసి పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. నారాయణ్‌ఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించిన బి-ఫారాలను స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్‌లకు నిర్మలా జగ్గారెడ్డి హ్యాండోవర్ చేశారు.
అలాగే జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బి-ఫారాలను నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



