వార్డు అభివృద్ధి జరగకపోతే రాజీనామా చేస్తా: అఫిడవిట్ సమర్పించిన 7వ వార్డు బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ గుప్త
రాజకీయాల్లో జవాబుదారీతనానికి కొత్త అర్థం చెబుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు బీజేపీ అభ్యర్థి సింగారపు సత్యనారాయణ గుప్త ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు

రాజకీయాల్లో జవాబుదారీతనానికి కొత్త అర్థం చెబుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు బీజేపీ అభ్యర్థి సింగారపు సత్యనారాయణ గుప్త ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చే హామీలు గెలిచాక అమలుకు నోచుకోవు అనే విమర్శలకు భిన్నంగా ఆయన రూ. 100 నాన్-జుడీషియల్ స్టాంపు పేపర్ ద్వారా తన వాగ్దానాలను అఫిడవిట్ రూపంలో ప్రకటించారు.
తాను గెలిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో వార్డు అభివృద్ధికి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతే తన కౌన్సిలర్ పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని ఆయన ఈ అఫిడవిట్‌లో శపథం చేశారు.
ఈ అఫిడవిట్‌లో ప్రధానంగా:
ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో అవినీతి లేకుండా చూడటం, ప్రభుత్వ ఫీజులకే పనులు పూర్తి చేయడం.
ప్రతి వీధికి సి.సి. రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం,ఇంటింటికీ తాగునీటి సరఫరా.
ఉచిత R.O. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు,భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు.
ప్రభుత్వ స్థలాల్లో పార్కులు, ఓపెన్ జిమ్‌ల అభివృద్ధి.
అర్హులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడం వంటి అంశాలను పేర్కొన్నారు.
మార్పు తన వార్డు నుండే మొదలవ్వాలని, మాట తప్పితే పదవిలో కొనసాగే నైతిక హక్కు తనకు ఉండదని ఈ సందర్భంగా సత్యనారాయణ గుప్త స్పష్టం చేశారు.



