Andole – Jogipet: అందోల్ శివారులో నాలుగు పరిశ్రమలు.. మంత్రి దామోదర గుడ్ న్యూస్
అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి పరిశ్రమలను తీసుకువచ్చి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని అందోల్ - జోగిపేట ప్రజలు మంత్రి దామోదర రాజనరసింహను కోరారు.

అందోల్: అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి పరిశ్రమలను తీసుకువచ్చి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని అందోల్ – జోగిపేట ప్రజలు మంత్రి దామోదర రాజనరసింహను కోరారు. విద్య, వైద్యంతోపాటు, పరిశ్రమల ఏర్పాటు తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. అందోల్ శివారు సంగుపేట, మాసానిపల్లి ప్రాంతాల్లో నాలుగు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. శనివారం జోగిపేట మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డుల్లోని మహిళలు మంత్రిని కలిసి, చదువుకున్న తమ పిల్లలు ఉపాధి లేక ఖాళీగా తిరుగుతున్నారని, బైపాస్ సహా వేర్వేరు కారణాలతో మార్కెట్ పడిపోవడంతో ఉపాధి కోల్పోయామని ఆవేదనను వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి మార్గం చూపాలని వారు మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివాదంలో భూమి…
మహిళల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, అందోల్ ప్రాంతంలో ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. ఆ వివాదం క్లియర్ అయిన వెంటనే ఇక్కడ పరిశ్రమల స్థాపనకు గట్టి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జోగిపేట మున్సిపాలిటీని విద్య, వైద్య కేంద్రాల హబ్‌గా వేగంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు.
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించడంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటు కూడా కాంగ్రెస్ చూసుకుంటుందని అన్నారు. మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ ఎస్.జగన్ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చిట్టిబాబు సహా తదితరులు పాల్గొన్నారు.



