చిట్కుల్లో కాంగ్రెస్ విజయభేరి.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసందోహమైన ఇస్నాపూర్
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సోమవారం ఉధృతంగా సాగింది

చిట్కుల్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సోమవారం ఉధృతంగా సాగింది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ప్రచార ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు, యువకులు భారీగా తరలిరావడంతో చిట్కుల్ వీధులన్నీ ‘జై కాంగ్రెస్’ నినాదాలతో హోరెత్తాయి.
ఈ సందర్భంగా అభ్యర్థులు నీలం కవిత, సంగన్నగారి జ్యోతి, సుంకరి రవీందర్లతో కలిసి నీలం మధు ముదిరాజ్ కాలనీల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిట్కుల్ వాసులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివని, ఇంటి బిడ్డగా వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మున్సిపాలిటీల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్ల నిధులతో చిట్కుల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే అధికార పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.



