బ్లూజే ఏరోస్పేస్ సరికొత్త రికార్డు.. హైదరాబాద్‌లో భారీ కార్గో విమానం ‘జెన్ #2’ ఆవిష్కరణ
ప్రముఖ డీప్-టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ ‘బ్లూజే ఏరోస్పేస్’ (BluJ Aerospace) సరికొత్త సాంకేతిక ఆవిష్కరణతో విమానయాన రంగంలో మరో అడుగు ముందుకు వేసింది.

హైదరాబాద్: ప్రముఖ డీప్-టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ ‘బ్లూజే ఏరోస్పేస్’ (BluJ Aerospace) సరికొత్త సాంకేతిక ఆవిష్కరణతో విమానయాన రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. సుమారు 4 సంవత్సరాల పాటు స్వదేశీ ప్రయోగశాలల్లో సాగించిన పరిశోధనల అనంతరం రూపొందించిన ‘జెన్ #2’ (Gen #2) ప్రోటోటైప్ విమానాన్ని సంస్థ అధికారికంగా ప్రదర్శించింది. విభిన్న రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఒకే వేదికపై నిర్మించేందుకు వీలుగా డెవలప్ చేసిన ‘వాంటిస్’ (VANTIS) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ నయా మోడల్‌ను తీసుకొచ్చారు. గతంలో 500 కేజీల విభాగంలో దేశంలోనే తొలి పబ్లిక్ ఫ్లైట్ డెమోను విజయవంతంగా పూర్తి చేసిన ‘జెన్ #1’ సాంకేతికతను మరింత అప్‌గ్రేడ్ చేస్తూ దీనిని నిర్మించారు. ఈ జెన్ #2 విమానానికి సంబంధించిన ఫ్లైట్ టెస్టింగ్‌లు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి.
భారీ సరుకు రవాణా కోసం ప్రత్యేక డిజైన్
పూర్తిగా బ్యాటరీ ఆధారిత శక్తితో నడిచే ఈ విమానాన్ని భారీ సరుకు రవాణా (లాజిస్టిక్స్) అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గరిష్టంగా 500 కేజీల టేకాఫ్ బరువుతో పనిచేసే సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్, సుమారు 200 కేజీలకు పైగా బరువున్న కార్గోను సులభంగా మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఈ విమానాన్ని కస్టమర్ పైలట్స్, పేలోడ్ టెస్టింగ్ క్షేత్రస్థాయి లాజిస్టిక్స్ ఆపరేషన్ల పరిశీలన కోసం వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ఇదే వాంటిస్ ఆర్కిటెక్చర్ ఆధారంగా 1 టన్ బరువును రవాణా చేయగల భారీ కార్గో డ్రోన్లను, అలాగే సుదూర ప్రయాణాలకు ఉపయోగపడే హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాలను కూడా రూపొందించాలని బ్లూజే ఏరోస్పేస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే కామన్ ప్లాట్‌ఫారమ్ విధానాన్ని ఏరోస్పేస్ రంగానికి పరిచయం చేశామని కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ అమర్ శ్రీవత్సవాయ వెల్లడించారు. వేర్వేరు రవాణా అవసరాలకు తగ్గట్టుగా విమానాలను తక్కువ వ్యయంతో, వేగంగా ఉత్పత్తి చేయడానికి వాంటిస్ ఆర్కిటెక్చర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్, ఎక్స్‌ప్రెస్ కార్గో, ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్స్ రక్షణ రంగ భాగస్వామ్యాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే పవర్ సెక్టార్‌కు చెందిన ఒక ప్రముఖ పీఎస్‌యూతో కలిసి పైలట్ ప్రాజెక్ట్‌ను ఈ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. హైదరాబాద్‌లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అత్యాధునిక ఫెసిలిటీలో 50 మందికి పైగా ఇంజనీర్లతో కార్యకలాపాలు సాగిస్తున్న బ్లూజే ఏరోస్పేస్, తమ సరికొత్త డిజైన్లపై ఇప్పటికే మేధోసంపత్తి (పేటెంట్) హక్కులను సొంతం చేసుకుంది.



