దోమల అగర్బత్తీల మాయాజాలం.. మార్కెట్లో 85% అక్రమ ఉత్పత్తులే!

మన దేశంలో దోమల నివారణ అగర్బత్తీల మార్కెట్ విలువ సుమారు 2000 కోట్ల రూపాయలు కాగా, అందులో అత్యధిక భాగం అక్రమ సంస్థల నియంత్రణలో ఉందని హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (HICA) ఆందోళన వ్యక్తం చేసింది.
కంఫర్ట్, రిలాక్స్, హ్యాపీ నైట్ వంటి ఆకర్షణీయమైన పేర్లతో విక్రయించే ఈ ఉత్పత్తులకు సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ రిజిస్ట్రేషన్ (CIR) ఉండదు. ప్రభుత్వం ఆమోదించిన పరీక్షలు ఏవీ లేకుండానే ఇవి నేరుగా మార్కెట్లోకి వస్తున్నాయి.
హెచ్‌ఐసీఏ డైరెక్టర్ జయంత్ దేశ్‌పాండే మాట్లాడుతూ, కెమిస్ట్ షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇవి సురక్షితమని 48 శాతం మంది వినియోగదారులు నమ్ముతున్నారని, కానీ ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అలాగే చాలా ఉత్పత్తులు ‘హెర్బల్’ లేదా ‘సిట్రోనెల్లా’ అని తప్పుదోవ పట్టించే వాదనలు చేస్తున్నాయని, వీటిలో వాడే రసాయనాల వివరాలు ఎక్కడా ఉండవని ఆయన పేర్కొన్నారు.
ఏదైనా ఉత్పత్తి కొనే ముందు ప్యాకెట్ పైన ‘సీఐఆర్ రిజిస్ట్రేషన్ నంబర్’ స్పష్టంగా ఉందో లేదో చూసుకోవాలని, అప్పుడే అది ఇళ్ల లోపల వాడటానికి సురక్షితమని గుర్తించాలని ఆయన వినియోగదారులకు పిలుపునిచ్చారు.



