Sangareddy: బేటి బచావో.. బేటి పడావోతో బాలికల బంగారు భవిష్యత్తు: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
బాలికల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న బేటి బచావో - బేటి పడావో కార్యక్రమం వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.

- ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు అవార్డులు, కిట్లు అందజేసిన కలెక్టర్
సంగారెడ్డి, జనవరి 05: బాలికల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న బేటి బచావో – బేటి పడావో కార్యక్రమం వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యా, క్రీడా రంగాల్లో రాణించాలి
జిల్లా స్థాయిలో విద్య, క్రీడా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు కలెక్టర్ అవార్డు సర్టిఫికెట్లు, ప్రత్యేక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బాలికలు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణిస్తూ జిల్లాకు గర్వకారణంగా మారుతున్నారని అభినందించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
ప్రోత్సాహక కిట్ల పంపిణీ
అవార్డు గ్రహీతలకు ఒక బ్యాగ్, ట్రాక్ సూట్, వాటర్ బాటిల్, మోటివేషనల్ పుస్తకం, టీ-షర్ట్ తో కూడిన కిట్ ను కలెక్టర్ అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో ఎం. రంజన్ కుమారి, భావన, మాల్విక, అశ్విని, ఋత్విక రెడ్డి, వైష్ణవి, ఎం. శైలజ, పి. గౌతమి, భూమిక, ప్రవళిక తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి, జిల్లా సమన్వయకర్త పల్లవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



