తెలంగాణ

Jaggareddy: సంగారెడ్డి, సదాశివపేటల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: జగ్గారెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా పని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  • భవిష్యత్తు ఎమ్మెల్యే అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డే

సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా పని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని అభ్యర్థుల ప్రకటనతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

నిర్మలా జగ్గారెడ్డి ప్రచార సారథి..
ఈ సమావేశంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తనను పిలవవద్దని, భవిష్యత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డే ప్రచారానికి వస్తారని స్పష్టం చేశారు. తాను ప్రచారానికి రాకపోయినా సంగారెడ్డి ప్రజలు తనను నమ్ముతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ పేరును ఆయన ఖరారు చేశారు. ఒకవేళ పదవి ఎస్సీ రిజర్వుడు అయితే మహేష్ లాల్ అభ్యర్థిగా ఉంటారని, వైస్ చైర్మన్ అభ్యర్థిగా షఫీ హఫీజ్ ఉంటారని ప్రకటించారు.

పోలీసుల అండతో రాజకీయం చేయొద్దు
అధికారంలో ఉన్నాం కదా అని పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూడవద్దని జగ్గారెడ్డి కార్యకర్తలకు హితవు పలికారు. తన రాజకీయ జీవితం మొత్తం పోలీసులను ఎదురించి చేశానే తప్ప, వారిని వాడుకోలేదని గుర్తు చేశారు. ప్రజా బలంపైనే ఆధారపడి గెలవాలని సూచించారు.

జగ్గారెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
టికెట్ల కోసం ఎవరూ తన దగ్గరకు గానీ, గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ ప్రెసిడెంట్‌ను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.

పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నిస్తే, ఎన్నికల సమయం అని చూడకుండా వెంటనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

అభ్యర్థులు ఎన్నికల్లో ఇచ్చే వాగ్దానాలను సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నెరవేర్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

ప్రజల గెలుపు కోసం చేసే ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

సంగారెడ్డి మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *