Sangareddy: చూస్తూ కాదు… వింటూ పుస్తకాలు చదివేయచ్చు!
దృష్టిలోపం ఉన్నవారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చదువు, సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఉద్దేశించిన సౌండ్ లైబ్రరీని సంగారెడ్డి పట్టణంలో జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తీసుకొచ్చింది.

- సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రవణ గ్రంథాలయం
- అంధుల కోసం ఆధునిక సదుపాయాలతో
- అందుబాటులోకి తెచ్చిన జిల్లా యంత్రాంగం
కందిలి, సంగారెడ్డి: దృష్టిలోపం ఉన్నవారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చదువు, సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఉద్దేశించిన సౌండ్ లైబ్రరీని సంగారెడ్డి పట్టణంలో జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లైబ్రరీ ద్వారా అంధులు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలుగుతారు. ఈ లైబ్రరీ ద్వారా దృష్టిలోపం గల వారికి ఉపయుక్తమైన పలు సదుపాయాలు ఉన్నాయి. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా దృష్టి లోపమున్న వారు పూర్తిస్థాయిలో కంప్యూటర్‌ను స్వయంగా ఆపరేట్ చేయవచ్చు. చదువు, అభ్యాసం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ల వినియోగం వంటి పనులను సులభంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ లైబ్రరీని స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంజయ్య కలిసి ప్రారంభించారు.
స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం!
భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం ఉంది. ఈ సదుపాయం ద్వారా విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ముద్రిత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదవగలుగుతారు. ఇందులో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ (గూగుల్ ఏఐ ఆధారిత) విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఏంజెల్ ప్లేయర్స్ ( డీజీ ప్లేయర్స్) 10 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాల ద్వారా స్కాన్ చేసిన పుస్తకాలు, ఎడిటబుల్ ఫైళ్లు లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న పుస్తకాలను కాపీ చేసి వినియోగించుకోవచ్చు. కంప్యూటర్ అవసరం లేకుండానే తెలుగు, హిందీ తదితర భారతీయ భాషల పుస్తకాలను ఆడియో రూపంలో వినే సౌకర్యం ఉంది. భారతీయ యాసతో స్పష్టంగా చదివే విధానం ఇందులో ప్రత్యేకత.
బ్రెయిలీ ప్రింటింగ్ సదుపాయం!
ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ఉన్న పుస్తకాలను (పీడీఎఫ్, జేపీజీ లేదా ముద్రిత పేపర్ రూపంలో) బ్రెయిలీ లిపిలోకి మార్పిడి చేసి ముద్రించే సదుపాయం ఉంది. దీంతో దృష్టి హీనత గల వారు బ్రెయిలీ ద్వారా పుస్తకాలను చదవవచ్చు. ఈ లైబ్రరీ దృష్టిలోపం గల విద్యార్థుల విద్యా పురోగతికి, స్వావలంబన దిశగా ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని లైబ్రరీ నిర్వాహకులు తెలిపారు. ఈ సౌండ్ లైబ్రరీ ని జిల్లాలోని దృష్టిలోపం గల విద్యార్థులు వినియో గించుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



