
- బెల్టు దుకాణాలు ఉండొద్దంటూ గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం
- పోలీసుల మద్దతుతో ఈ పల్లెలో సామాజిక మార్పునకు నాంది
కందిలి, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో మద్యపాన నిషేధానికి గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. గ్రామ పరిధిలో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. మద్యం అమ్మిన వారికి రూ.50 వేలు, కొనుగోలు చేసిన వారికి రూ.10 వేల జరిమానా విధించాలని గ్రామసభ నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయాన్ని గ్రామ యువత, మహిళలు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి తీసుకున్నారు.
మద్యానికి.. బానిసలుగా మారుతుండటంతో!
గ్రామంలో బెల్టు షాపులు విపరీతంగా పెరగడం వల్ల యువత మద్యానికి బానిసవుతున్నారు. కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. ఈక్రమంలోనే మద్యపాన నిషేధం దిశగా తీర్మానం చేశామని గ్రామస్తులు తెలిపారు. దీంతో పాటు మైనర్లకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, నిషేధిత గుట్కాలు విక్రయించకూడదని కూడా గ్రామసభ తీర్మానించింది. పిల్లలు, యువత ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ బాలరాజు గ్రామసభ తీర్మానానికి పూర్తి మద్దతు ప్రకటించి, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.



