తెలంగాణసంగారెడ్డి

Hetero: లోపాలు సరిదిద్దుకోకపోతే… పరిశ్రమను మూసేస్తాం!

* హెటిరో సంస్థకు స్పష్టం చేసిన పీసీబీ అధికారులు
* ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని
తదుపరి నోటీసులు లేకుండా చర్యలుంటాయని హెచ్చరిక
* తాము సూచించిన నిబంధనలన్నీ నెలరోజుల్లోగా
పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
* కంపెనీలో వ్యర్థాలు నిల్వ చేస్తున్న నాలుగు ట్యాంకులు
కూల్చేయాలని స్పష్టం చేసిన అధికారులు
* అదనంగా బ్యాంకు గ్యారంటీ మరో రూ.64 లక్షలు
జమచేయాలని ఆర్డర్​
* మున్సిపల్​ ఎన్నికలను బహిష్కరించేలా
ఈనెల 11న మహార్యాలీకి కేవీపీసీ​ సన్నద్ధం

కందిలి, సంగారెడ్డి: ‘‘పరిశ్రమ కొన్ని నిబంధనలను పాటించడం లేదు. ఇది పర్యావరణంపై, ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మేం గుర్తించిన లోపాలన్నింటినీ నెలరోజుల్లోగా సరిద్దిద్దాలి. లేని పక్షంలో చర్యలు తీసుకుంటాం. నెలరోజుల్లో ప్రమాణాల మేరకు పరిశ్రమలో ఏర్పాట్లు పూర్తి చేయకుంటే, పర్యావరణహితాన్ని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ మూసివేతకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి తదుపరి నోటీసు ఇవ్వకుండా ఈ పనిచేయాల్సి వస్తుంద’’ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు హెటిరో డ్రగ్ యూనిట్​ – 1కు జనవరి 1న ఆదేశాలిచ్చారు.

నాలుగు ట్యాంకులు.. కూల్చేయండి!
హెటిరో పరిశ్రమ ప్రాంగణంలో వ్యర్థాలు నిల్వ చేసేందుకు వీలుగా ఆరు ట్యాంకులున్నాయి. వీటిలో నాలుగింటిన్ని కూల్చేయాలని పీసీబీ అధికారులు స్పష్టం చేశారు. వాటిలో ఉన్న వ్యర్థాలను సెంట్రల్​ ఈటీపీకి పంపించాలన్నారు. ఆ వెంటనే ఆ నాలుగు ట్యాంకులను తొలగించాలన్నారు. భవిష్యత్తులో ఆ నాలుగు ట్యాంకుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థాలను నిల్వ చేయవద్దన్నారు.

రూ.64లక్షలు.. బ్యాంకు గ్యారెంటీ జమచేయండి!
* హెటిరో పరిశ్రమ యూనిట్​ – 1కు సంబంధించి ప్రస్తుతం పీసీబీ వద్ద రూ.32లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంది. దీనికి అదనంగా బ్యాంకు గ్యారెంటీ కింద మరో రూ.64 లక్షలు జమచేయాలని పీసీబీ అధికారులు ఆదేశించారు.
* కంపెనీ గతంలో బోర్డు విధించిన షరతులను (Consent Conditions), జూలై 2021, జనవరి 2023, మే 2025 నాటి ఆదేశాలను బేఖాతరు చేస్తోందని బోర్డు స్పష్టంగా పేర్కొంది.
* కంపెనీలోని ZLD (సున్నా వ్యర్థాల విడుదల) సిస్టమ్, ATFD, బయోలాజికల్ ETP ప్లాంట్ల నుండి వెలువడుతున్న దుర్వాసనను అరికట్టడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని బోర్డు తప్పుబట్టింది.
* గాలి కాలుష్యాన్ని నియంత్రించాల్సిన స్క్రబ్బర్లను సమర్థవంతంగా నిర్వహించడం లేదని గుర్తించింది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ధారించింది.
* తాము సూచించిన అన్ని అంశాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని తెలిపింది. లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి నోటీసులు ఇవ్వకుండానే క్లోజర్​ ఆర్డర్స్​ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

ఆగస్టు నుంచి.. మొదలైన నిరసనలు!
దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువు ఆగస్టు కంటే ముందు నుంచే గులాబీ రంగులోకి మారడం మొదలైంది. దీంతో స్థానికులు నిరసన తెలపడం ప్రారంభించారు. కాలుష్య సమస్య నుంచి తమకు ఉపశమనం దక్కేలా చూడాలని వేడుకున్నారు. టీపీజేఏసీ, సైంటిస్ట్ ఫర్​ పీపుల్​, రైతు స్వరాజ్య వేదిక తదితర సంస్థలు ప్రజలకు మద్దతుగా నిలిచాయి. దీంతో ఈ ఉద్యమం ఉదృతమైంది. వివిధ రూపాల్లో నిరసనలు హోరెత్తాయి. ఈ క్రమంలోనే అధికారులు నీటి నమూనాలు తీసుకెళ్లారు. వాటిని విశ్లేషించి, తాజాగా హెటిరో సంస్థకు నోటీసు ఇచ్చారు. తాము పరిశ్రమలో పర్యటించిన సందర్భంగా కొన్ని లోపాలను గుర్తించామని, వాటిని నెలరోజుల్లో సరిదిద్దుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్​ ఎన్నికలు.. బహిష్కరిస్తామంటూ ర్యాలీ!
కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడిన స్థానికులు ఇప్పటి వరకు పలురూపాల్లో తమ నిరసనను తెలియజేశారు. ఈ క్రమంలో బైండోవర్లు, కేసులు కూడా వారిపై నమోదయ్యాయి. రానున్న మున్సిపల్​ ఎన్నికలను బహిష్కరించాలని కమిటీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని అందరికీ తెలియజేసేలా ఈనెల 11న భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఈ ర్యాలీకి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని టీపీజేఏసీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్​ వై.అశోక్​ కుమార్​, ప్రతినిధులు ఆర్​.లక్ష్మి, ఏ.మానస ప్రకటించారు.

‘‘నల్లకుంట చెరువు కలుషితం కావడానికి హెటిరో సంస్థనే కారణమంటూ స్థానికులు తొలి నుంచి ఆరోపిస్తున్నారు. నిబంధనలను పాటించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తాజాగా పీసీబీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వాటిని సరిదిద్దని పక్షంలో పరిశ్రమ మూసివేత దిశగా చర్యలుంటాయని హెచ్చరించారు. కాలుష్య సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం దొరికే వరకు ప్రజల పక్షాన నిలిచి ఉద్యమిస్తాం”
– వై. అశోక్​ కుమార్​, కన్వీనర్​, టీపీజేఏసీ, సంగారెడ్డి జిల్లా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *