
పెద్ద శంకరంపేట: ప్రజల సమస్యలను వారి ముంగిటనే పరిష్కరించేందుకు ‘ప్రజల చెంతకే ప్రజావాణి’ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదిక అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండల స్థాయిలోనే తక్షణ పరిష్కారం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల విన్నపం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా, వారి దూరాభారాన్ని తగ్గించేందుకు మండల స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వయంగా స్వీకరించిన కలెక్టర్, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత మండల స్థాయి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి విన్నపం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద శంకరంపేట మండలంలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను కలెక్టర్ రాహుల్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా చర్చించారు.
విశేష స్పందన
పెద్ద శంకరంపేటలో ఏర్పాటు చేసిన ఈ ప్రజావాణికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రెవెన్యూ, ఉపాధి హామీ, విద్యుత్, సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. అధికారులందరూ ఒకే చోట అందుబాటులో ఉండటంతో తమ విన్నపాలు త్వరగా పరిష్కారం అవుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



