Andole: అందోల్ ఆసుపత్రి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.

సంగారెడ్డి: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని, అందోల్‌లో నిర్మాణంలో ఉన్న 150 పడకల ఆసుపత్రి పనుల్లో వేగం పెరగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
సమయపాలన పాటించని పక్షంలో చర్యలు
వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధులకు గైర్హాజరైనా, నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. పారదర్శకత కోసం బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నిషన్ ఆధార్ బేస్డ్ హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపు ఉండాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు.

మందుల కొరత ఉండకూడదు
ఆసుపత్రుల్లో నిత్యావసర మందుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు ఆసుపత్రిలోనే అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మందులను బయటకు రాయకూడదని కలెక్టర్ కఠినంగా చెప్పారు. రోగుల పట్ల కనికరంతో వ్యవహరించాలని, వారికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
నిర్మాణ పనుల్లో వేగం పెరగాలి
అందోల్‌లో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, హాస్టల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని టీజీఎంఐడీసీ ఈఈ రవీందర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే సంగారెడ్డి నర్సింగ్ కళాశాల భవన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంత్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ మరియు ఇతర వైద్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.



