తెలంగాణసంగారెడ్డి

Kandili Exclusive: సుతిమెత్తగా హెచ్చరించడానికేనా.. పీసీబీ అధికారులున్నది?

‘హెటిరో పరిశ్రమ పర్యావరణ కాలుష్​యానికి కారణమవుతోందని మీరే స్పష్టం చేశారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని నివేదికల్లో పేర్కొన్నారు.

* ఫ్లోమీటర్లు తప్పుడు రీడింగులు ఇస్తున్నాయని ఆన్​ లైన్​ నిఘా వ్యవస్థలు ట్యాంపర్​ అయినట్లు స్పష్టత
* పరిశ్రమలో నల్లటి విషపూరిత రసాయన వ్యర్థజలాలు నిలిచి ఉన్నట్లు గుర్తింపు
* అనుమతి లేకుండానే 12 TPH సామర్థ్యం ఉన్న బాయిలర్​ అక్రమంగా వినియోగిస్తున్న పరిస్థితి
* హెటిరో పరిశ్రమకు సంబంధించిన విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్న పీసీబీ అధికారులు
* కానీ చివరకు సరిదిద్దుకోవాలని చెప్పి చర్యలు తీసుకోకపోవడమేంటనే ప్రశ్నలు
* పీసీబీ సభ్య కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్న దోమడుగు రైతులు

కందిలి, పటాన్​ చెరు: ‘‘హెటిరో పరిశ్రమ పర్యావరణ కాలుష్​యానికి కారణమవుతోందని మీరే స్పష్టం చేశారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని నివేదికల్లో పేర్కొన్నారు. అలాంటి కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సిందిపోయి, సుతిమెత్తగా హెచ్చరించి వదిలేయడానికే మీరున్నది. ఇదే మీ డ్యూటీ” అంటూ దోమడుగు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెటిరో డ్రగ్స్ (Unit-I) పై జారీ చేసిన ఆదేశాల (Order No. RCP-30/TGPCB/TF/HO/2026-29)లోని లోపాలను నిరసిస్తూ పీసీబీ సభ్య కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. డిసెంబరు 12న ఇచ్చిన నివేదికలోని సాక్ష్యాల ఆధారంగా కఠిన పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

లేఖలో పేర్కొన్న…  ప్రధానాంశాలిలా!
* నల్లకుంట చెరువు కాలుష్యానికి సంబంధించి మీ కార్యాలయం జనవరి 01, 2026న జారీ చేసిన ఆదేశాలను మేం పరిశీలించాం. మీ అధికారులే డిసెంబరు12, 2025 నాటి నివేదికలో పరిశ్రమ చేస్తున్న ఉల్లంఘనలను సాక్ష్యాధారాలతో సహా నిర్ధారించారు. కానీ మీ తాజా ఆదేశాలు కేవలం మరమ్మతుల హెచ్చరికలకే పరిమితం కావడం మాకు తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. వీటిని మీ నుంచి సమాధానం కావాలి.

1. సాంకేతిక మోసాన్ని ఎందుకు శిక్షించలేదు?
మీ తనిఖీ నివేదిక పేజీ38లో పరిశ్రమ తన ఆన్‌లైన్ నిఘా వ్యవస్థలను (OCEMS) ట్యాంపరింగ్ చేస్తోందన్నారు. ఫ్లో మీటర్లు తప్పుడు రీడింగులు ఇస్తున్నాయని గుర్తించామన్నారు. ప్రభుత్వ నిఘా నేత్రాలనే మోసం చేస్తున్న పరిశ్రమపై ‘క్రిమినల్ కేసులు’ పెట్టాలి. కానీ కేవలం “మెరుగుపరుచుకోండి” అని ఆదేశాలు ఇవ్వడం తప్పు చేసిన వారికి వత్తాసు పలకడం కాదా?

2. బయటపడి ఉన్న వ్యర్థాల సాక్ష్యం!
పరిశ్రమ వెలుపల, డ్రైనేజీ కల్వర్టుల వద్ద “నల్లటి విషపూరిత వ్యర్థ జలాలు” (Blackish water) నిల్వ ఉన్నాయని పేజీ 33లో మీరే ధృవీకరించారు. ఇవి నేరుగా నల్లకుంట చెరువులోకి చేరుతున్నాయని మీకూ తెలుసు. ఆ నష్టానికి గాను “Environmental Compensation” (పర్యావరణ పరిహారం) ఎందుకు విధించలేదు? “Polluter Pays” సూత్రం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదు?

3. అక్రమంగా బాయిలర్ నిర్వహణ!
బోర్డు అనుమతి (CFO) లేకుండానే 12 TPH సామర్థ్యం గల బాయిలర్‌ను అక్రమంగా నడుపుతున్నారని పేజీ 10లో మీ అధికారులు నివేదించారు. చట్టాన్ని ధిక్కరిస్తూ పారిశ్రామిక కార్యకలాపాలు సాగిస్తున్నా, కనీసం ‘స్టాప్ ప్రొడక్షన్’ ఆర్డర్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటి?

4. చెరువు శుద్ధిపై మౌనమెందుకు?
మీ లాబొరేటరీ నివేదిక ప్రకారం చెరువులోని రసాయనాలు (Sertraline HCl) హెటిరో పరిశ్రమవే అని తేలిపోయింది. కానీ మీరు జనవరి 01, 2026 న ఇచ్చిన ఆదేశాల్లో చెరువును పరిశ్రమ ఖర్చుతో ఎప్పటిలోగా శుద్ధి చేయాలో (Lake Restoration) ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు.

ఇవే మా డిమాండ్లు!
1. మీ అధికారుల నివేదికలోని పేజీ 10, 33, 38లలో ఉన్న సాక్ష్యాల ప్రకారం సదరు పరిశ్రమను తక్షణమే మూసివేయాలి.
2.నల్లకుంట చెరువును పూర్వస్థితికి తెచ్చేందుకు అయ్యే పూర్తి ఖర్చును పరిశ్రమ నుంచే వసూలు చేయాలి.
3. తప్పుడు రీడింగులతో బోర్డును మోసం చేస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించాలి.
4. ప్రజల ప్రాణాల కంటే పరిశ్రమ ప్రయోజనాలే ముఖ్యమని బోర్డు భావిస్తే, మేము ఈ నివేదికలను ఆధారంగా చేసుకుని జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT), హైకోర్టును ఆశ్రయిస్తాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *