తెలంగాణసంగారెడ్డి

Sangareddy: పోలీసుల లంచం సొమ్ము.. పెట్రోలు బంక్​ ఫోన్ పే ఖాతాలోకి!

మద్యం సేవించి ఎవరైనా ఆ మార్గంలో వస్తున్నారంటే పోలీసులు పండుగ చేసుకుంటున్నారు. వాహనం ఆపగానే, బ్రీత్​ ఎనలైజర్​ తో పరీక్షలు చేస్తున్నారు

* పటాన్​ చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్​ స్టేషన్ పరిధిలో ​ఇదీ వసూళ్ల దందా
* నిబంధనలను ఉల్లఘించే వారి బలహీనతలే ఆసరాగా దర్జాగా దందా చేస్తున్న ఒక ఎస్సై
* ప్రముఖ ఆలయం వద్దకు వచ్చి మద్యం సేవించి వాహనాలు నడిపే వారే టార్గెట్​
* కేసు నమోదు కావొద్దంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్​
*- పెట్రోల్​ బంక్​ ఫోన్​ పే నంబరుకు డబ్బులు జమచేయాల్సిందిగా హుకుం
* చేసేదేమీలేక అడిగినంత ఫోన్​ చేసి బతుకుజీవుడా అంటూ వెళ్లిపోతున్న వాహనదారులు

కందిలి, పటాన్​ చెరు: మద్యం సేవించి ఎవరైనా ఆ మార్గంలో వస్తున్నారంటే పోలీసులు పండుగ చేసుకుంటున్నారు. వాహనం ఆపగానే, బ్రీత్​ ఎనలైజర్​ తో పరీక్షలు చేస్తున్నారు. ఆ మొత్తం ఘటనను సెల్​ ఫోన్లో రికార్డ్​ చేస్తున్నారు. కేసు నమోదవుతుందని భయపెడుతున్నారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే తాము ఇచ్చిన ఫోన్​ పే నంబరుకు డబ్బులు పంపాలని డిమాండ్​ చేస్తున్నారు. పటాన్​ చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ వసూళ్ల దందా యథేచ్చగా సాగుతోంది. కేవలం వాహనదారుల బలహీనతలను ఆసరా చేసుకొని లంచం సొమ్ములకు మరిగారు. ఈ అంశమై ‘కందిలి’ అందిస్తున్న పరిశోధనాత్మక కథనమిది.

ఎవరికీ చెప్పరనే ధీమాతో.. దర్జాగా వసూళ్లు!
పటాన్​ చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్​ స్టేషన్ పరిధిలో పనిచేసే పోలీసులు లంచం సొమ్ములు వసూలు చేయడంలో టెక్నాలజీని వాడుకుంటున్నారు. నేరుగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వాహనదారుల నుంచి ఫోన్​ పే చేయించుకుంటున్నారు. అది కూడా తమను అనుకూలంగా ఉండే ఒక పెట్రోల్​ బంక్​ ఖాతాలో జమచేయిస్తున్నారు. తాము అనుకున్న టార్గెట్​ పూర్తికాగానే, సదరు పెట్రోల్​ బంకుకు వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరైనా ఈ అంశమై ఫిర్యాదు చేసినా, తమకేం సంబంధం లేదని చెప్పుకునేలా ఈ సరికొత్త ఆలోచనకు తెరదీశారు. వాహనదారులు ఎలాగూ నిబంధనలను ఉల్లంఘించారు… ఎవరికీ ఫిర్యాదు ఇవ్వరనే ధీమా వల్ల ఈ వసూళ్ల దందా గత కొంత కాలంగా యథేచ్ఛగా నడుస్తోంది.

వాహనం ఆపి.. బ్రీత్​ అనలైజనరుతో పరీక్షిస్తూ వీడియోలు!
ఈ ప్రాంతంలో ఒక ప్రముఖ ఆలయం ఉంది. ఇక్కడకు శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో చాలా మంది వస్తుంటారు. మొక్కులు సమర్పించి, దావత్​ లు చేసుకుంటారు. మద్యం సేవిస్తుంటారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని ఆ పోలీస్​ స్టేషనులోని ఎస్సై తమకు అనుకూలంగా మలచుకున్నారు. డ్రంక్​ అండ్​ డ్రైవింగ్​ పరీక్షలు చేస్తూ, రోజూ దర్జాగా వసూళ్లకు తెరదీశారు. వాహనదారుడిని ఆపడం, బ్రీత్​ అనలైజర్​ పరీక్ష చేయడం, ఆ మొత్తం ఘటనను వీడియో తీయడం చేస్తారు. దీంతో సహజంగానే వాహనదారులు భయపడిపోయి, కాళ్ల బేరానికి వస్తున్నారు. ఇదే అదనుగా లంచం ఇస్తే, కేసు ఉండదంటూ పోలీసులు చెబుతున్నారు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోవడం లేదు. ఒక ఫోన్​ పే నంబరు ఇచ్చి, దాంట్లోకి ట్రాన్స్​ ఫర్​ చేయాలని సూచిస్తున్నారు.

పోలీసు ఉన్నతాధికారులు… దృష్టిసారించాల్సిన అంశమిది!
ఇలా లంచం రూపంలో వసూలు చేస్తున్న డబ్బులు ఒక పెట్రోలు బంక్​ ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఆ రోజు చెకింగ్స్​ ముగియగానే సదరు ఎస్సై ఆ డబ్బులు పెట్రోల్​ బంక్​ నుంచి తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారూ, ఈ అంశమై ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ఇలా పోలీసులకు చిక్కి, లంచం డబ్బులను ఫోన్​ పే ద్వారా సమర్పించుకున్నారు. ఈ అంశమై సంగారెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే, వాస్తవాలు వెలుగు చూస్తాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *