తెలంగాణసంగారెడ్డి

GMR: కాంగ్రెస్​ పార్టీలో చేరినా.. ఎంటిక మందం లాభం జరగలేదు!

‘‘అప్పుడున్న పరిస్థితుల్లో ఒక తప్పటడుగు వేశాను. అయినా నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు, నాకు ఎంటిక మందం లాభం కూడా జరగలేదు. అన్నీ కోర్టుల ద్వారానే చూసుకుంటున్నా’’మని పటాన్​ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

* అన్ని విషయాలూ కోర్టు ద్వారానే చూసుకుంటున్నాం
* అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక తప్పటడుగు వేశాను
* అయినా నియోజకవర్గ ప్రజలకు, నాకు ఎలాంటి లాభం లేకుండా పోయింది
* బీఆర్​ఎస్​ పార్టీ మూడు సార్లు నాకు టికెటిచ్చింది.. మీ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించారు
* పటాన్​ చెరు పరిధిలో అయిదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేద్దాం
* మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కందిలి, పటాన్​ చెరు
‘‘అప్పుడున్న పరిస్థితుల్లో ఒక తప్పటడుగు వేశాను. అయినా నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు, నాకు ఎంటిక మందం లాభం కూడా జరగలేదు. అన్నీ కోర్టుల ద్వారానే చూసుకుంటున్నా’’మని పటాన్​ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్​ ఎన్నికలను పురస్కరించుకొని స్థానిక బీఆర్​ఎస్​ నేతలతో కలిసి ఆదివారం ఆయన సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చకు తావిచ్చాయి.

మూడు సార్లు బీఆర్​ఎస్​ టికెటిచ్చింది!
‘‘నాకు మూడుసార్లు బీఆర్​ఎస్​ పార్టీ టికెటిచ్చింది. మీ అందరి ఆశీర్వాదాలతో నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అందుకే ఆలోచన చేశాను. ఇప్పుడు అయిదు మున్సిపాలిటీల్లో 104 మంది కౌన్సిలర్​ స్థానాలున్నాయి. మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ట్రేడ్​ యూనియన్​ పరంగా ఒక వింగ్​, పెద్దమనుషుల పరంగా ఒక వింగ్​, కులసంఘాల వారీగా ఒక వింగ్​.. ఇలా అన్ని కేటగిరీల వారీగా విభజిద్దాం. ఈ అయిదు మున్సిపాలిటీల్లో మనకున్న సత్సంబంధాలను వాడుకుందా’’మని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి వివరించారు. కన్నతల్లిదండ్రుల వంటి పార్టీ అయిన బీఆర్​ఎస్​ విజయం కోసం కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ మారుతారంటూ.. గత కొంతకాలంగా ప్రచారం!
మూడోసారి బీఆర్​ఎస్​ టికెట్​ మీద గెలిచిన గూడెం మహిపాల్​ రెడ్డి, తన తమ్ముడు గూడెం మధుసూదన్​ రెడ్డి అక్రమ మైనింగ్​ వ్యవహారం వెలుగు చూశాక అధికార కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కానీ అనర్హత పిటిషన్​ నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్​ఎస్​ నేతలకే ప్రాధాన్యమిస్తున్నారంటూ కాంగ్రెస్​ పార్టీ నేతలు పెద్దయెత్తున గొడవలకూ దిగారు. ఇటీవల గూడెం మధుసూదన్​ రెడ్డి మాజీ మంత్రి హరీశ్​ రావుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. కొల్లూరులో జరిగిన కార్యక్రమానికి హాజరుకావడం, నూతన సంవత్సరం సందర్భంగా హరీశ్​ రావును కలవడం, ఆయన కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆసక్తిరేపుతున్నాయి. ఇకపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగానే గూడెం మహిపాల్​ రెడ్డి కార్యకలాపాలు నిర్వహిస్తారనే అంశమై స్పష్టత వచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *