తెలంగాణసంగారెడ్డి

Andole – Jogipet: మినీ సచివాలయంగా అందోల్ – జోగిపేట.. ఆర్‌డీఓ కార్యాలయ భవన నిర్మాణానికి నిధుల విడుదల

అందోల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టింది.

అందోల్: అందోల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అందోల్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పక్కన కేటాయించిన స్థలంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO) కార్యాలయం, అధికారుల నివాస గృహాల (Residential Quarters) నిర్మాణ పనులకు నిర్ణయించారు.

రూ. 5.75 కోట్లతో అధునాతన భవనం
గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 5.75 కోట్ల అంచనా వ్యయంతో ఈ సమీకృత భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి నిధులను జనవరి 30న ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో అందోల్- జోగిపేట రెవెన్యూ డివిజన్ ఆఫీసు పాత భవనాల్లో కొనసాగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు సొంత భవనం అందుబాటులోకి వస్తే డివిజన్ పరిధిలోని మండలాల ప్రజలకు రెవెన్యూ సేవలన్నీ ఒకే చోట సులభంగా అందనున్నాయి.

అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన.. ఆర్డీఓ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకం

అధికారుల నివాస గృహాలూ..
కేవలం కార్యాలయం మాత్రమే కాకుండా, అదే ప్రాంగణంలో ఆర్‌డీఓ, ఇతర సిబ్బందికి కావాల్సిన నివాస గృహాలను కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల అధికారులు స్థానికంగానే ఉండి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

అభివృద్ధి బాటలో వడివడిగా
మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో ఈ భవనంతో పాటు క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే ఐసీడీఎస్ (ICDS) భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతోపాటు స్వామి వివేకానంద పార్క్ సుందరీకరణ పనులు కూడా చేపట్టారు. రెవెన్యూ డివిజన్ కార్యాయ భవనం పూర్తయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్‌డీఓ ఆఫీస్ పక్కపక్కనే ఉండటంతో ఈ ప్రాంతం ఒక మినీ సెక్రటేరియట్‌లా మారిపోనుంది. ఇప్పటికే అందోల్ కేంద్రంలో 150 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్, హాస్టల్ పనులు ఊపందుకున్నాయి. ఆగస్టునాటికి పనులు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. రానున్న ఏడాదిలో అందోల్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

అందోల్‌లో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాలు

అదే సమయంలో ఉపాధి కరవైన ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని నియోజకవర్గవాసులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *