తెలంగాణసంగారెడ్డి

Damodar vs Raghunandan: అందోల్‌లోనే నవోదయ? పంతం నెగ్గించుకున్న దామోదర!

సంగారెడ్డి జిల్లాకు మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయం (JNV) ఏర్పాటు అంశం ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది.

  • గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనేదే నవోదయ లక్ష్యం
  • ఇందుకు అనుగుణంగానే అందోల్‌లో స్థలం కేటాయింపు

అందోల్: సంగారెడ్డి జిల్లాకు మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయం (JNV) ఏర్పాటు అంశం ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. దీంతో విద్యాలయం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఉండాలనే లక్ష్యంతో తెలంగాణకు కొత్తగా 7 పాఠశాలలను 2024లో మంజూరు చేసింది. అందులో ఒకటి సంగారెడ్డి జిల్లాకు దక్కింది. అయితే, ఈ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో మంత్రి, ఎంపీ మధ్య తలెత్తిన విభేదాల వల్ల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

మంత్రి దామోదర రాజనర్సింహ పట్టు

సంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, అందోల్ ఎమ్మెల్యే అయిన దామోదర రాజనర్సింహ, ఈ విద్యాలయాన్ని తన నియోజకవర్గ కేంద్రమైన అందోల్‌లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అందోల్ శివారులో 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేసి, నవోదయ విద్యాసమితికి ప్రతిపాదించారు.

ఎంపీ రఘునందన్ రావు అభ్యంతరం..

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాత్రం ఈ విద్యాలయాన్ని పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ లేదా పటాన్‌చెరులో ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వల్ల అక్కడ అన్ని వసతులు మెరుగ్గా ఉంటాయని ఆయన వాదన. ఎంపీగా కేంద్ర స్థాయిలో ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నారు.

నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

స్థలం: సుమారు 25 ఎకరాల స్థలాన్ని జవహర్ నవోదయ విద్యాలయ సమితి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బదిలీ చేయాలి.

తాత్కాలిక భవనం: శాశ్వత భవన నిర్మాణం పూర్తి కావడానికి సుమారు రెండేళ్లు పడుతుంది. ఈలోపు తరగతులు ప్రారంభించడానికి తగిన తాత్కాలిక భవనాలను జిల్లా యంత్రాంగం చూపించాల్సి ఉంటుంది.

పరిశీలన: రెవెన్యూ శాఖ అందోల్ మండల కేంద్రం, జహీరాబాద్, సంగారెడ్డి, నిజాంపేట మండలం బాచేపల్లి, పటాన్‌చెరు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించి సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, తుది ఆమోదం నవోదయ సమితి అధికారుల నుంచి రావాల్సి ఉంది.

నష్టపోతున్న విద్యార్థులు..
రాజకీయ పట్టింపుల వల్ల నవోదయ విద్యాలయ సమితి అనుమతులను పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఇప్పటికే కొత్త నవోదయాలు ప్రారంభం కాగా, సంగారెడ్డిలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, వివాదం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. దీనివల్ల 2026-27 విద్యా సంవత్సరానికి జరగాల్సిన అడ్మిషన్ల ప్రక్రియలో కూడా సంగారెడ్డి జిల్లా పేరు చేరలేదు. గడువు సమీపిస్తున్న తరుణంలో నేతలు తమ పంతాలను వీడి, జిల్లా ప్రయోజనాల కోసం ఏకాభిప్రాయానికి రావాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

ఎవరు పంతం నెగ్గుతుంది?

ఈ వివాదంలో ఎవరు విజయం సాధిస్తారనేది కొన్ని కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది. నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం.. పాఠశాల ఏర్పాటుకు అనువైన వాతావరణం, నీటి వసతి, రవాణా సౌకర్యాలు ఎక్కడ మెరుగ్గా ఉన్నాయో అధికారులు సర్వే చేస్తారు. ఒకవేళ కేంద్రం పటాన్‌చెరు కావాలని అడిగినా, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ భూమి ఇవ్వడానికి నిరాకరించి, అందోల్‌లోనే ఇస్తామని పట్టుబడితే కేంద్రం వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే ఉచితంగా భూమి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, జిల్లా యంత్రాంగం మంత్రి ఆదేశాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే, నిధులు, తుది అనుమతులు కేంద్రం నుంచి రావాలి కాబట్టి రఘునందన్ రావు అక్కడ ఒత్తిడి తీసుకురావచ్చు.

నవోదయ కేరాఫ్ పల్లెటూరు.. నగరానికి ఎందుకో?
సాధారణంగా ఇలాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే భూమికే ప్రాధాన్యత ఉంటుంది. అందోల్ అనేది గ్రామీణ ప్రాంతం కావడం, నవోదయ విద్యాలయాల ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడం కాబట్టి, నిబంధనల పరంగా అందోల్‌కు మొగ్గు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పటాన్‌చెరు, అమీన్ పూర్ ప్రాంతాలు ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది హైదరాబాద్‌లో కలిసిపోయాయి.

కొత్తగా అక్కడ విద్యాసంస్థలు అక్కర్లేదనేది నిర్వివాద అంశం. రఘునందన్ రావు ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గితే నవోదయ అసలు లక్ష్యం నెరవేరి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూమి ఆధారంగానే కేటాయింపులు ఉండనుండటంతో ఈ అంశంలో మంత్రి దామోదర రాజనరసింహ పట్టుదల నెగ్గే అవకాశం పుష్కలంగా ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై ఇరువురునేతలు త్వరగా ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *