తెలంగాణసంగారెడ్డి

ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి.. రుద్రారం గీతం కాంక్లేవ్ లో పరిశ్రమ నిపుణులు

కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు

కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, రుద్రారం లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘భవిష్యత్తును ఇంజనీరింగ్ చేయడం: ప్రధాన రంగాలలో ఆవిష్కరణలు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన మూడవ దఫా ఇండస్ట్రీ కాంక్లేవ్ లో వారు ప్రసంగించారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ స్థానభ్రంశం చేయవచ్చని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా అంచనా వేశారు.

రానున్న రోజులలో ఉద్యోగ మార్కెట్ విస్తరిస్తూనే ఉంటుందని, అయితే ఏఐ ఆధారిత యుగానికి తగిన నైపుణ్యాలను విద్యార్థులు ఇప్పటి నుంచే సమకూర్చుకోవాలని నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఇంటర్న్ షిప్ లు, పరిశ్రమల సందర్శన, ఆచరణాత్మక అభ్యాసం ద్వారా తమ జ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరచుకోవాలన్నారు. సాంకేతిక నైపుణ్యాల కంటే అభ్యర్థుల ప్రవర్తన, వైఖరి 75 శాతం విజయాన్ని నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. కోర్ ఇంజనీరింగ్ కు పెద్దపీట వేస్తూ పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య అంతరం తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై గీతం యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఎన్ఎక్స్ పీ సెమీకండక్టర్స్ ప్రతినిధి ప్రీత్ యాదవ్, స్టెల్లాంటిస్ డెలివరీ లీడ్ సుమన్ గోర్లా ముఖ్య అతిథులుగా పాల్గొని కీలకోపన్యాసాలు చేశారు. అనంతరం మూడు విభిన్న అంశాలపై నిర్వహించిన ప్యానెల్ చర్చల్లో యాక్సిస్ ఎనర్జీ, ప్రజ్ ఇండస్ట్రీస్, ఓడీఎఫ్, అల్ట్రాటెక్, బాష్, గ్లోబల్ ఫౌండ్రీస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. శక్తి, తయారీ రంగాలు, హార్స్ పవర్ నుంచి కంప్యూట్ పవర్ వరకు మారుతున్న సాంకేతికతలు కోర్ ఇంజనీరింగ్ లోని అవకాశాలపై వారు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు స్వాగతోపన్యాసం చేయగా, సీజీసీ ప్రతినిధులు, అధ్యాపకులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *