అందోల్‌కు దామోదర వరాల వర్షం.. రూ.27 కోట్లతో పనులకు శ్రీకారం
అందోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శనివారం భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

- చెరుకు కట్ట వద్ద రూ.5 కోట్లతో టూరిజం రెస్టారెంట్
- అందోల్-జోగిపేట ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం
అందోల్: అందోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శనివారం భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ. 27 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పలు భవనాలను ప్రారంభించడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి పర్యటన వివరాలు ఇవే..
విద్యా, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యత..
ఉదయం 11 గంటలకు హున్నాపూర్ (శివంపేట్) పాలిటెక్నిక్ కళాశాలలో రూ.43 లక్షల CSR నిధులతో నిర్మించిన వర్క్ షాప్ షెడ్‌ను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం 11:30 గంటలకు అందోల్‌లో రూ. 1.80 లక్షల వ్యయంతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
పర్యాటక రంగానికి కొత్త కళ..
అందోల్ చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటికే చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, సిమెంట్ రోడ్డు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయిస్తోంది. దీంతోపాటు రూ.5 కోట్ల నిధులతో నిర్మించనున్న టూరిజం రెస్టారెంట్‌కు ఉదయం 11:45 గంటలకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది స్థానిక పర్యాటక రంగానికి ఊతమివ్వనుంది.
ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కంప్లెక్స్..
మధ్యాహ్నం 12:00 గంటలకు అందోల్- జోగిపేట్‌లో ప్రతిష్టాత్మకంగా రూ. 20.00 కోట్ల భారీ నిధులతో నిర్మించ తలపెట్టిన సమగ్ర కార్యాలయ సముదాయం (Integrated Office Complex) నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. దీనివల్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట చేరి ప్రజలకు పాలన మరింత సులభతరం కానుంది. అనంతరం 12:15 గంటలకు జోగిపేట్ గ్రంథాలయంలో రూ. 53 లక్షలతో నిర్మించిన మొదటి అంతస్తును ప్రారంభిస్తారు.
ప్రజా సేవ కోసం హెల్ప్ డెస్క్..
చివరిగా మధ్యాహ్నం 12:30 గంటలకు జోగిపేట్లోని కాంగ్రెస్ కార్యాలయ భవనంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘హెల్ప్ డెస్క్’ను మంత్రి ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం నియోజకవర్గ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.



